ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 8:26 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థుల శాంతియుత సమ్మె నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్‌లకు సరిపోని సౌకర్యాలు. హాస్టళ్లు, తరగతి గదులు, వసతులు కల్పించాలని విద్యార్థుల డిమాండ్

కరీంనగర్:ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులు మౌలిక సదుపాయాల కొరతపై గళమెత్తారు. నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్‌లకు సరిపడా వసతులు కల్పించడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ విద్యార్థులు శాంతియుత సమ్మె చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించి, కళాశాలలో మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పేర్కొన్న వివరాల ప్రకారం.. నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్‌లకు సరిపడా ఆసుపత్రి సౌకర్యాలు లేవని, ప్రస్తుత కళాశాల భవనం కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు బ్యాచ్‌లకు కేవలం రెండు లెక్చర్ హాళ్లు మాత్రమే ఉండగా, సుమారు 400 మంది విద్యార్థులకు ఆరు వాష్‌రూమ్‌లు, ఒకే డైనింగ్ హాల్ ఉండటం. ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. నాలుగు బ్యాచ్‌లకు సరిపడా గ్రంథాలయ సదుపాయాలు కూడా అందుబాటులో లేవని తెలిపారు.
అంతేకాకుండా హాస్పిటల్, క్యాంపస్‌లో అవసరమైన మౌలిక వసతులు, క్రీడా మైదానం, పరిసరాల అభివృద్ధి, ఏసీలు, స్టడీ టేబుళ్లు వంటి సదుపాయాలు కూడా లేవని విద్యార్థులు తమ ఆందోళనలో ప్రస్తావించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మూడేళ్ల రెండు నెలలుగా ఎదురుచూస్తున్నామని ఫ్లెక్సీలో పేర్కొనడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
విద్యార్థుల ప్రధాన డిమాండ్లు ఇవే..
బాలుర, బాలికల హాస్టళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలి.
పూర్తయిన నర్సింగ్ కళాశాల భవనం, క్యాంపస్‌ను జనవరి రెండో వారంలో అప్పగించాలి.
అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేసి విద్యార్థుల రవాణా సమస్యలను పరిష్కరించాలి.
తాము ఎవరికీ వ్యతిరేకంగా సమ్మె చేయడం లేదని, తమకు రావాల్సిన హక్కులు, సౌకర్యాల కోసమే ఆందోళన చేస్తున్నామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. తమకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి, సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.
వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం అత్యంత అవసరం. భవిష్యత్తులో వైద్యులుగా సమాజానికి సేవలందించాల్సిన విద్యార్థులు ప్రస్తుతానికి తరగతి గదులు, హాస్టళ్లు, ఇతర వసతుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడంపై అధికారులు స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు అన్నారు.